వారసత్వం అనేది ఎంట్రీ పాస్ మాత్రమే...!

SMTV Desk 2018-12-15 15:38:27  KTR, TRS, Telangana Elections, Meet The Press

హైదరాబాద్, డిసెంబర్ 15: టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం ఎంట్రీ పాస్ లాంటిదేనని అన్నారు. వొకసారి రాజకీయాల్లోకి వచ్చాక మనల్ని మనం నిరూపించుకోవాలి, అలాగే ప్రజల మద్దతును సంపాదించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను గత 12 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాననీ, నాలుగు ఎన్నికలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చి ప్రచారం నిర్వహించినప్పటికీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే తెలంగాణ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఈ రోజు నిర్వహించిన ‘ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో తరువాతి ముఖ్యమంత్రి మీరేనా? అనే ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ..‘తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా పర్యటించా.తెలంగాణ సాధించుకున్నాక తెరాస పార్టీ తరపున సిరిసిల్ల నుంచి ప్రజామోదంతో గెలుపొందా. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంత్రిగా తన కేబినెట్ లో అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులను వొకే తాటిపైకి తెచ్చి అప్పట్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం. దీంతో తాజాగా నాకు తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని అప్పగించారు. భవిష్యత్ లో ఇచ్చే ఏ బాధ్యతను అయినా నేను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అని తెలియజేసారు.