రానున్న 24 గంటల్లో కోస్తాకు భారీ వర్ష సూచన...!

SMTV Desk 2018-12-13 17:53:25  CM Chandrababu, Kosta Andhra Rain Fall

అమరావతి, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తిత్లీ నుంచి తేరుకుంటున్న సమయంలో మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి కృష్ణా జిల్లా మచిలీపట్నంకు 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండ ప్రభావంతో కోస్తా జిల్లాలతో పాటూ ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు అధికారులు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ వాయుగుండం క్రమంగా బలపడి.. రాగల 24 గంటల్లో తుఫాన్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో సమీక్ష జరిపి, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.