నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్...!

SMTV Desk 2018-12-06 17:01:24  Chandrababu, Kollu Raveendra, Yuvanestam, Nirudyogabruthi

అమరావతి, డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యువనేస్తం క్రింద నిరుద్యోగ భృతి పొందుతున్న వారికి ఏపీ ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. విలేకరులతో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి యువ నేస్తం పధకం కింద 4 లక్షలకు పైగా నిరుద్యోగులకి ప్రతీ నెల రూ.1000 భృతి ఇస్తున్నామని మంత్రి తెలియజేసారు. దాదాపు ఈ పధకానికి 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిరుద్యోగ భృతి తీసుకుంటున్న వారికి ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 10 నుంచి 555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని చెప్పారు. దీని కోసం ప్రభుత్వం రూ.24 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కోసం నిరుద్యోగులు ముఖ్యమంత్రి యువనేస్తం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఇష్టం ఉన్న వాటిలోనే కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.