పూర్తైన కోవింద్ ప్రమాణస్వీకారం

SMTV Desk 2017-07-25 13:12:27   Ramnath kovind sworn, President of India 2017, modi, pranab mukerjee, arunjetly, sumitra mahajan, kcr, chandrababu,

న్యూఢిల్లీ, జూలై 25: భారతదేశ 14వ రాష్ట్రపతిగా బీహార్ మాజీ గవర్నర్‌ రామ్‌ నాథ్‌ కోవింద్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్‌ ముఖర్జీ... కోవింద్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన రెండో దళిత నేత కోవింద్‌. అంతకు ముందు ఆయన కుటుంబ సమేతంగా రాజ్‌ ఘాట్‌ చేరుకుని, మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం రామ్‌ నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా తొలిసారి ప్రసంగం చేశారు. దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ , ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విదేశీ దౌత్యాధికారులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార సందర్భంగా 21 శతఘ్నులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతిని ప్రణబ్‌ ముఖర్జీ తన ఆసనంలో కూర్చొబెట్టారు. ఈ కార్యక్రమం ముగిశాక కోవింద్‌ రాష్ట్రపతి భవనానికి చేరుకుంటారు. అక్కడి సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేస్తారు.