‘ఆర్‌ ఆర్‌ ఆర్’‌ మూవీలో మరో భామ

SMTV Desk 2018-12-02 13:16:59  RRR, Priyamani, Rajamouli,

హైదరాబాద్, డిసెంబర్ 02 : మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్ ‌ (వర్కింగ్‌ టైటిల్‌)తో దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో యాక్షన్‌ ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం చరణ్‌, తారక్‌ కొత్త లుక్‌లో సిద్ధమయ్యారు. ప్రముఖ బాలీవుడ్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు.

కాగా, ఈ సినిమా కోసం రాజమౌళి నటి ప్రియమణిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కథ విన్నారని, తుది నిర్ణయం తెలియజేయాల్సి ఉందని సమాచారం. ఆమెను ఏ పాత్ర కోసం సంప్రదించారనే విషయం మాత్రం తెలియలేదు. దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రియమణి చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయట. ప్రస్తుతం ఆమె ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ లో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.

మరోపక్క ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించనున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె, చిత్ర బృందం స్పందించలేదు. ఈ సినిమా కోసం ‘రామ రావణ రాజ్యం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.