హెచ్‌పీసీఎల్‌ బాధ్యతలో జైట్లీ కమిటీ

SMTV Desk 2017-07-25 12:58:41  arun jaitly, petroliyam, hpcl, ongc, newdelhi

న్యూఢిల్లీ, జూలై 25 : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలోని ముగ్గురు మంత్రుల కమిటీ తోడ్పాటుతో హిందుస్థాన్‌ పెట్రోలియమ్‌ కార్పోరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)లో ప్రభుత్వ వాటాను ఓఎన్‌జీసీకి విక్రయించే ప్రక్రియ సజావుగా సాగనుంది. సమయం, ధర, నియమ నిబంధనలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఈ కమిటీ సహకారం అందిస్తుందని చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. హెచ్‌పీసీఎల్‌లో 51.11% వాటాను ఓఎన్‌జీసీకి ప్రభుత్వం విక్రయించింది. కాగా ఈ ప్రతిపాదనకు జూలై 19న ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గం (సీసీఈఏ) సూత్రప్రాయ అనుమతులు ఇచ్చిందని, 2018 మార్చి 31 కల్లా వాటా విక్రయ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి తెలిపారు. ఈ వాటాల విక్రయ లావాదేవీలు పూర్తయిన అనంతరం కూడా ప్రభుత్వ రంగ సంస్థగానే హెచ్‌పీసీఎల్‌ కొనసాగుతుందని, ప్రత్యేక బోర్డు, బ్రాండు గుర్తింపు కొనసాగుతాయని ధర్మేంద్ర ప్రధాన్‌ వివరించారు. "హెచ్‌పీసీఎల్‌కు ప్రస్తుతం వార్షికంగా 24.8 మిలియన్‌ టన్నుల రిఫైనరీ సామర్థ్యం ఉంది. ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌కు 15.1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది. ఓఎన్‌జీసీ గ్రూపునకు ఉన్న పూర్తి రిఫైనింగ్‌ సామర్థ్యం హెచ్‌పీసీఎల్‌ సొంతమవుతుంది" అని మంత్రి తెలిపారు. హెచ్‌పీసీఎల్‌ 40 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో దేశంలోనే మూడో అతి పెద్ద సంస్థగా అవతరిస్తుందని అన్నారు. తొలి రెండు స్థానాల్లో ఐఓసీ(69.2), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(62) కొనసాగుతున్నాయి. ఓ వైపు హెచ్‌పీసీఎల్‌.. రాజస్థాన్‌, ఏపీ(విశాఖపట్నం)లో 9 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన ప్లాంట్లను ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉంది. అనతరం దీని సామర్ధ్యం 50 టన్నులకు చేరుతుందని మంత్రి తెలిపారు.