తెలంగాణలో ప్రచారం చేయనున్న సోనియా, రాహుల్

SMTV Desk 2018-12-01 18:02:36  sonia rahul, telangana elections

హైదరాబాద్, డిసెంబర్ 01: యూపీయే చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబరు 3,4,5 తేదీలలో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన సోనియాగాంధీ మేడ్చల్ ప్రజాకూటమి సభలో భావోద్వేగంతో మాట్లాడి ప్రజలను బాగానే ఆకట్టుకోగలిగారు. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రజాకూటమి నేతలందరూ ఆమె తొలి పర్యటనలో శాలువలు కప్పి సన్మానం చేసి సెంటిమెంటును బాగానే రాజేయగలిగారు. ఆమె తిరిగి వెళ్ళిపోయిన తరువాత కూడా ప్రజాకూటమి నేతలందరూ ఆ సెంటిమెంటు వేడి చల్లారిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. కనుక పోలింగుకు రెండు రోజుల ముందు మళ్ళీ మరోసారి ఆమెను రాష్ట్రంలో పర్యటింపజేసినట్లయితే ప్రజాకూటమివైపు ప్రజలను మొగ్గు చూపేలా చేయవచ్చని భావిస్తున్నారు. కనుక ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన డిసెంబరు 5వ తేదీన ఆమెను తెలంగాణలో పర్యటింపజేయాలని భావిస్తున్నారు.

రాహుల్ గాంధీ సోమవారం గద్వాల, తాండూరులో ప్రజాకూటమి బహిరంగసభలలో పాల్గొంటారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మంగళవారం ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి వస్తారని సమాచారం. వీరు ముగ్గురితో పాటు పలువురు జాతీయస్థాయి కాంగ్రెస్‌ నేతలు కూడా చివరి మూడు రోజులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు.

డిసెంబరు 5వ తేదీ సాయంత్రం 5గంటలకు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం నిలిపివేయవలసి ఉంటుంది. కనుక మిగిలిన ఈ 5 రోజులలో అన్ని పార్టీలు, వాటి అభ్యర్ధులు ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉదృతం చేస్తున్నాయి.