ఇక లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కష్టమే ?

SMTV Desk 2018-11-24 13:55:28  Lifetime free incoming calls, vodafone, airtel

న్యూ ఢిల్లీ, నవంబర్ 24:మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు షాకిచ్చేలా లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ప్లాన్‌లను త్వరలో రద్దుచేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సిద్ధమవుతున్నాయి. ఇది కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సైతం డబ్బులు చెల్లించాల్సిందే. ఈ సేవలను కొనసాగించేందుకు సంబంధిత కంపెనీల చందాదారుల కనీస రీఛార్జిలు చేయించుకోవాల్సి ఉంటుంది. టెలికం మార్కెట్లోకి ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్‌ జియో ప్రవేశంతో తమ ఆదాయానికి గండి పడటంతో.. ఈ సంస్థలు జియో పోటీని తట్టుకొనేందుకు ప్రస్తుత టారిఫ్‌లలో మార్పులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పథకాలకు స్వస్తి పలకనున్న ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు కనీస రీఛార్జి పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే, ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు సంబంధించి నిమిషాల చొప్పున ఛార్జీలు వడ్డించకుండా కనీస రీఛార్జిలను చేసుకున్న వారికి నిర్ణీత కాలానికి ఫ్రీ ఇన్‌కమింగ్‌ కాల్స్ ‌సదుపాయాన్ని అందించనున్నాయి.