కమల్ హాసన్ ను కలిసిన పవన్ కళ్యాణ్

SMTV Desk 2018-11-23 12:46:14  kamal hasan, pawan kalyan, janasena,

చెన్నై, నవంబర్ 23: జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్‌కల్యాణ్‌ ప్రముఖ నటుడు కమలహసన్‌తో భేటీ అయ్యారు. చెన్నై పర్యటనలో ఉన్న పవన్‌కల్యాన్‌ కమల్‌తో జరిపిన సమావేశంలో ప్రస్తుత దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. ఇదే సందర్భంలో ప్రాంతీయ, జాతీయ పార్టీల విధానాలు, ప్రభుత్వాల పనితీరును గూర్చి ప్రస్తావనకు వచ్చింది.

ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ భావ సారూప్యత ఉన్న నేతలను కలుపుకొని పోవడంలో భాగంగానే కమల్‌హసన్‌తో భేటీ అయినట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీలు సమన్వయం, సహకారంతో పనిచేయకపోవడంతోనే కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని ఆరోపించారు.

అదేవిదంగా జాతీయ స్థాయిలో పొత్తులపై పవన్‌కల్యాణ్‌ స్పందిస్తూ భవిష్యత్‌లో కమలహసన్‌ స్థాపించబోయే మక్కల్‌ నీది మయ్యం పార్టీతోపాటు, తమిళనాడులో మరో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌తో కూడా కలసి పనిచేస్తానని వివరించారు. రాబోయే రోజుల్లో కమల్‌, రజనీకాంత్‌తో కలిసి ముందుకెళ్లే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. బిజెపి నిజంగా దేశాన్ని అభివృద్ధి చేస్తుందని తాను ఆశించి మద్దతు ఇచ్చానని, కానీ ఇప్పుడు అది నెరవేరలేదని వ్యాఖ్యానించారు.