ఖానాపూర్ లో టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ

SMTV Desk 2018-11-22 19:15:32  telangana elections, trs, kcr, khanapur

ఆదిలాబాద్, నవంబర్ 22: ఎన్నికల ప్రచారంలో అపద్దర్మ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఖానాపూర్ నుంచి బరిలో ఉన్న రేఖ నాయక్‌ని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ‘ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఎన్నికల్లో నాయకులు కాదు ప్రజలు గెలవాలి. 58 ఏళ్ళు పాలించి సమస్యలన్నీ పెండింగ్‌లో పెట్టారు. నాలుగేళ్లు టీఆర్‌ఎస్ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి. కూటమికి ఉమ్మడి మేనిఫెస్టో లేదు. వొక్కొక్క పార్టీ వొక్కొక్క మేనిఫెస్టో రూపొందిస్తోంది. దీంతో ప్రజలు తికమక పడుతున్నారు. వారిలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలీదు. సీల్డ్ కవర్‌లో ఎవరి పేరు వస్తుందో అంతుచిక్కదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు వొక్క రూపాయి ఇవ్వనంటే.. కాంగ్రెస్ నేతలు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్ నేతలు ప్రతిఘటించారు.

దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా. రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ఎరువుల కోసం రైతులు గతంలో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మన రాష్ట్ర విత్తనాలు పక్క రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. నిరుద్యోగుల కోసం మూడు వేల నిరుద్యోగ భృతి ప్రకటించాం. 58 ఏళ్ళు ఎవరూ చేయని పనులు మేము చేసి చూపించాం అని తెలిపారు కేసీఆర్.

‘చంద్రబాబును నేనొకసారి తరిమేశా.. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బాబును తీసుకొస్తున్నారు.. బాబును తరిమేయాల్సిన బాధ్యత మీదే అని ఆయన ఓటర్లను కోరారు. ‘ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇక్కడ ఏం పని? నేను ఆంధ్రాలో వెళ్లి పోటీ చేస్తే ఊరుకుంటారా, తరిమేయరూ? అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ మోటార్లు కాలిపోయాయని, తాను 40 ఏళ్లుగా రైతునని, తన పొలంలో మోటార్లు కూడా కాలిపోయాయని వెల్లడించారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని అసత్య ప్రచారం చేసింది వీళ్ళు కాదా అని విరుచుకుపడ్డారు.