రైల్వే శాఖకు జియో సేవలు

SMTV Desk 2018-11-22 19:13:51  Indian Railways, JIO Network

న్యూ ఢిల్లీ, నవంబర్ 22: టెలికం రంగంలో సంచలనంగా మారిన జియో ఇప్పుడు భారతీయ రైల్వేలో సేవలందించబోతోంది. 1 జనవరి 2019 నుంచి రైల్వే శాఖ జియో సేవలను వాడుకోనుంది. ప్రస్తుతం రైల్వేలో భారతీ ఎయిర్‌టెల్‌ సేవలందిస్తోంది. అయితే జియో వల్ల ఖర్చు భారం తగ్గే అవకాశం ఉండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి ఎయిర్‌టెల్‌ సేవల గడువు ముగుస్తుంది. గత ఆరేళ్లకుపైగా రైల్వే, ఎయిర్‌టెల్‌ సేవలను వినియోగించుకుంటోంది.‘ప్రస్తుతం రైల్వేలో 1.95లక్షల ఎయిర్‌టెల్‌ మొబైల్‌ కనెక్షన్లు ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి రైల్వేలోని 3.78లక్షల మంది సిబ్బందికి జియో సేవలను అందించనున్నాం. ఎక్కువ కనెక్షన్లు తీసుకోవడం వల్ల జియో నుంచి మంచి డీల్‌ లభించింది. దీనివల్ల మా ఫోన్‌ బిల్లులను 35శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది అని సీనియర్‌ అధికారి వొవొరు చెప్పారు.

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ కింద రైల్వేలో దాదాపు 1.95 లక్షల మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లు క్లోజ్డ్‌ యూజర్‌ గ్రూపు (సీయూజీ)లో ఉన్నాయి. ఇందుకోసం రైల్వే శాఖ ఎయిర్‌టెల్‌కు ఏడాదికి సుమారు రూ.100 కోట్ల బిల్లు చెల్లిస్తోంది. ఎయిర్‌టెల్ స్థానంలో జియో సేవలు వినియోగించుకుంటే ఈ బిల్లు 35% తగ్గి, రూ. 35 కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని కోసం టెలికం ప్రొవైడర్లతో ఇటీవల బిడ్డింగ్‌ నిర్వహించగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్లను, జియో వెనక్కు నెట్టింది. తక్కువ ధరతో బిడ్డింగ్‌ వేసింది.

జియో నెట్‌ వర్క్‌లో డేటా టారిఫ్‌లు, వాయిస్‌ కాల్స్‌ చౌకగా వుండటంతో రైల్వేశాఖకు బిల్లు భారం తగ్గనుంది. దీంతో రైల్వేశాఖ జియో వైపు మొగ్గు చూపింది. ఈ మేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.