ప్రముఖ నేతలపై ఎన్నికల సంఘం కేసు నమోదు

SMTV Desk 2018-11-21 17:19:33  Telangana election commission, Case file, Uttam kumar reddy, revanth reddy

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఉల్లంఘించినవారు ఎంతటివారైనా సరే కేసు నమోదు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షులు, ఆపద్ధర్మ మంత్రులు కూడా ఎన్నికల కోడ్‌కు అతీతం కారనే విధంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై కేసులు నమోదు చేయడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఆయనతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావుపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఈవో రజత్ కుమార్ తెలిపారు.

అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని తెలిపారు.సికింద్రాబాద్ వైఎంసీలో మతపరమైన సమావేశాలు నిర్వహించి ఓ వర్గం వారిని ప్రలోభపెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఉత్తమ్ ఇచ్చిన వివరణను పరిశీలించి గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. వీహెచ్‌పై కార్వాన్, బహుదూర్ పురా ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కేసులు నమోదు చేశామని, ఈ వ్యవహారంలో వీహెచ్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపతి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.