కూటమిపై ఆసక్తికర వాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

SMTV Desk 2018-11-20 19:43:02  Mahakutami, Kishan reddy

హైదరాబాద్, నవంబర్ 20: బిజెపి నేత కిషన్ రెడ్డి నిన్న ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ “మహాకూటమిలోని పార్టీలు తమ అసెంబ్లీ సీట్లను సర్దుబాట్లు చేసుకోలేక రెండు నెలలుగా పాట్లు పడుతూనే వున్నాయి. అయినా 119 స్థానాలుంటే మూడు పార్టీలు పోటాపోటీగా 130 నామినేషన్లు వేశాయి. మహాకూటమి ఆరంభంలోనే వైఫల్యం చెందిందనడానికి ఇదే నిదర్శనం. పరస్పర అవగాహన లేకుండా ఎన్నికలకు వెళుతున్న మహాకూటమి రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించగలుగుతుంది?” అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్‌ను ఉద్దేశ్యించి, “ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ చివరికి వారిని మోసం చేశారు. మరోపక్క ఓట్ల కోసం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలకు ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తెరాస ప్రభుత్వం పంచిపెట్టింది. కులమతాలను వద్దంటూనే కులాలు, మతాలవారీగా ఓటర్లతో తెరాస నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమి భయంతోనే సిఎం కేసీఆర్‌ యాగాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా డిసెంబరు 11వ తేదీన ఆ కుర్చీలో నుంచి దిగిపోక తప్పదు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు.