చారిటబుల్‌ ట్రస్టు ప్రారంభించిన ప్రముఖ పార్టీ ఎమ్మెల్యే

SMTV Desk 2018-11-19 16:32:04  YSRCP MLA, Roja selvamani, Roja birthday celebrations

చిత్తూర్, నవంబర్ 19: ప్రముఖ తెలుగు సినీ నటి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా తన జ‌న్మ‌దినం సంద‌ర్భంగా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఏర్పాటు చేసిన 4 రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద వైఎస్‌ఆర్‌ క్యాంటీన్‌ మొబైల్‌ వాహనాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా కలసి ప్రారంభించారు. అంతకు ముందు పట్టణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మండపం వద్ద వున్న తన ఇంటి ముందు అభిమానుల మధ్య రోజా కేక్‌ కట్‌ చేశారు.

పలువురు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా తన సొంత నిధులతో బస్‌ షెల్టర్లు, పాఠశాలలకు, ఆస్పత్రులకు తాగునీటి వసతి కల్పించడం చేస్తున్నారని అభినందించారు. ప్రస్తుతం పేదల ఆకలి తీర్చేందుకు రోజా చారిటబుల్‌ ట్రస్టు ద్వారా 4రూపాయలకే భోజనం పెట్టడం లాంటి మంచి కార్యక్రమం చేపట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో రోజాను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రభుత్వంలో కీలక పదవి అధిరోహిస్తారని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రోజాకున్న గుండె ధైర్యం మరెవరికీ లేదన్నారు.