బిజేపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి

SMTV Desk 2018-11-18 15:23:49  BJP, Andrapradesh, Finance minister of AP, Yanamala ramakrishnudu

అమరావతి, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు శనివారం వొక పత్రికా ప్రకటనలో నరేంద్రమోది, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ఆయన మాట్లుడుతూ “సిబిఐలో సంక్షోభం వల్లే ఏపిలో ‘సాధారణ సమ్మతి ని ఉపసంహరించాం. రాజకీయ కక్ష సాధింపులకు సిబిఐ సాధనం కారాదు. రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశానికి సమ్మతి ఉపసంహరణ సబబే. రాష్ట్రాలకున్న చట్టపరిధిలోనే చేశాం. రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారమే చేశాం. ఏపి స్ఫూర్తితో మిగిలిన రాష్ట్రాలు కూడా అదే నిర్ణయం చేపట్టాలి”

“సంక్షోభంలోకి సిబిఐని నెట్టిందెవరు..? ప్రధాని నరేంద్రమోది కాదా..? ఆర్బిఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందెవరు? ప్రధాని నరేంద్రమోది కాదా..? సివిసిపై, పిఎంవోపై సిబిఐ డైరెక్టర్ ఆరోపణలు గతంలో ఉన్నాయా..? ఏ1,ఏ2లు పీఎంవో లో తిరగడం గతంలో చూశామా..? సిబిఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ పరస్పర ఆరోపణలు ఎప్పుడైనా చూశామా..?

సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే ఈ జివో తెచ్చాం. సహకార సమాఖ్య అని బిజెపి నేతలు ఊదరగొట్టారు. సమాఖ్య స్ఫూర్తినే సర్వనాశనం చేశారు. శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగినా కేంద్రం బలగాలను సుమోటాగా దించరాదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే కేంద్ర బలగాలు రావాలి.అలాగే సిబిఐ విచారణకు కూడా రాష్ట్రాల అనుమతి అనివార్యం.

సిబిఐని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనేది నరేంద్ర మోది దుర్బుద్ధి. ఆర్ బిఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారు. రిజర్వ్ బ్యాంకు వద్ద నిల్వలపై కన్నేశారు. డిమానిటైజేషన్ బూమ్ రాంగ్ కావడంతో ఆర్బీఐ వద్ద నిధులను పొందాలని కుయుక్తులు పన్నుతున్నారు.

రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రంలోని బిజెపి నేతలు చూస్తున్నారు. వాటితో తమ ప్రత్యర్ధులపై కక్ష సాధించే కుట్రలు చేస్తునన్నారు.పేదల సంక్షేమం కంటెరాజకీయ కక్ష సాధింపే నరేంద్ర మోది,అమిత్ షాలకు ముఖ్యం. రాష్ట్రాల అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలే వారికి ప్రధానం.కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలపై కక్ష సాధించాలని చూస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాయాలని చూస్తున్నారు. జిఎస్ టి,డిమానిటైజేషన్ అన్నింటిలో విఫలం అయ్యారు అంటూ ఆరోపించారు.