నందమూరి వారసురాలుకు అండగా సోదరులు

SMTV Desk 2018-11-17 17:43:01  Nandamuri suhasini, Nandamuri kalyan ram, ntr, TDP, Kookatpally constiuency

హైదరాబాద్, నవంబర్ 17: కూకట్ పల్లి నియోజకవర్గం నుండి నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనకి తన సోదరుల మద్దతు కూడా లభించింది.

స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్ పల్లి నుంచి పోటీ చేసేందుకు టిడిపి టికెట్ కేటాయించడంతో ఆమె సోదరులు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హర్షం వ్యక్తం చేశారు. తమకు టిడిపి చాలా పవిత్రమైనదని, ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు తమ సోదరికి టికెట్ లభించడం అదృష్టంగా భావిస్తున్నామని వారు ట్వీట్ చేశారు. తమ సోదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కూకట్ పల్లి ప్రజలకు, తమ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ఈరోజు ఉదయం నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళిన సుహాసిని అక్కడ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తరువాత అక్కడి నుంచి మహాప్రస్థానంలో తన తండ్రి సమాధివద్దకు వెళ్ళి నివాళులు అర్పించారు. అనంతరం కూకట్ పల్లి ఆర్.డి.ఓ. కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, హరికృష్ణల స్పూర్తితో రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నాను. కూకట్ పల్లి ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నాను,” అని చెప్పారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాను. ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం మొదలుపెడతాను,” అని చెప్పారు.