ఆస్ట్రేలియాకు చేరుకున్న కోహ్లి సేన

SMTV Desk 2018-11-17 15:39:29  Team india, Virat kohli, Rishab panth, Australia tour

న్యూఢిల్లీ, నవంబర్ 17 : ఆస్ట్రేలియా తో తలపడడానికి భారత జట్టు ఈ రోజు ఉదయం ఆస్ట్రేలియా కి చేరుకుంది. ఆ జట్టుతో విరాట్‌ కోహ్లి సేన మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. అక్కడికి చేరుకున్న అనంతరం కోహ్లి తాను ఓ ఛాంపియన్‌తో కలిసి ఆ దేశంలో ఉన్నానంటూ ట్వీట్‌ చేశాడు. ఆ ఛాంపియన్‌ మరెవరో కాదు టీమిండియా యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్. ఆస్ట్రేలియా చేరుకున్నాం. కొన్ని వారాల పాటు ఇక్కడే.. ఛాంపియన్‌ రిషబ్‌ పంత్‌తో అని ఆయన పేర్కొన్నాడు. ఈ సందర్భంగా పంత్‌తో దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు. కోహ్లి సెల్ఫీ తీస్తుండగా పంత్‌ విక్టరీ సింబల్‌ను చూపుతూ పోజులిచ్చాడు. టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని పక్కకు పెట్టిన సెలెక్టర్లు టీ20 సిరీస్‌ కోసం రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేశారు. ఆడిన కొన్ని మ్యాచుల్లోనే ఈ యువ ఆటగాడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.

ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన టీమిండియా... అదే దూకుడును ఆస్ట్రేలియా పర్యటనలోనూ కనబర్చాలని భావిస్తోంది. ఆ పర్యటనలో మొదటి టీ20 మ్యాచ్‌ నవంబరు 21న ప్రారంభం కానుంది. ఆ దేశ పర్యటన అనంతరం భారత్‌-న్యూజిలాండ్ మధ్య టోర్నీ జరగనుంది. ఆ తరువాత టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉంటారు. ప్రపంచకప్‌ ముందు జరగనున్న ఈ మ్యాచుల ద్వారా భారత ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకుంటారని సెలక్టర్లు భావిస్తున్నారు.