బిజేపి పై ఆసక్తికర వాఖ్యలు చేసిన కేటిఆర్

SMTV Desk 2018-11-17 12:05:33  TRS, KTR, BJP

హైదరాబాద్, నవంబర్ 17: మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు టికెట్ కేటాయించక పోయేసరికి పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి తెరాస కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముస్లిం నేతలు శుక్రవారం కేటిఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేటిఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మేము భవిష్యత్తులో బిజెపితో లేదా నరేంద్రమోడీతో చేతులు కలుపుతామని రాజకీయ వర్గాలలో...మీడియాలో కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే మా రెండు పార్టీల మద్య సైద్దాంతికంగా చాలా విభేదం ఉంది. మాది పూర్తిగా సెక్యులర్ విధానం కాగా బిజెపిది మతతత్వవాదం. కనుక భవిష్యత్ లో ఎన్నడూ మేము బిజెపి లేదా నరేంద్రమోడీతో కలిసి పనిచేయబోమని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. లోక్ సభ ఎన్నికలలో మేము 16 సీట్లు గెలుచుకొని జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించడం మాత్రం ఖాయం,” అని చెప్పారు.

మంత్రి కేటిఆర్‌ చాలా సూటిగా చెప్పిన ఈ సమాధానం ద్వారా తెరాస-బిజెపి రహస్య అవగాహన లేదా బలమైన స్నేహసంబందాల గురించి మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టారని చెప్పవచ్చు. అయితే లోక్ సభ ఎన్నికలలో తెరాస 16 స్థానాలు గెలుచుకొన్నప్పటికీ జాతీయ రాజకీయాలలో ఏవిధంగా కీలకపాత్ర పోషిస్తుంది? అనే సందేహం కలుగుతుంది.

వొకవేళ కాంగ్రెస్‌ లేదా బిజెపి కూటములకు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తగినంతమంది ఎంపీలు లేనట్లయితే, వాటిలో దేనికో వొకదానికి తెరాస మద్దతు ఇచ్చి ‘కింగ్ మేకర్ అయితేనే కేంద్రంలో కీలకపాత్ర పోషించగలదు. సిఎం కేసీఆర్‌ చెపుతునట్లుగా కాంగ్రెస్‌, బిజెపిలకు సమానదూరం పాటించదలిస్తే వాటికి తెరాస మద్దతు ఇవ్వకూడదు. అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌, బిజెపిలకు మద్దతు ఇవ్వాలనుకొన్న పార్టీలను కూడగట్టి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారేమో? కానీ కాంగ్రెస్‌, బిజెపిలను కాదని తెరాసతో కలిసి పనిచేసేందుకు ఎన్ని పార్టీలు ముందుకు వస్తాయో అనుమానమే. వొకవేళ కొన్ని పార్టీలు తెరాసవైపు మొగ్గు చూపినా కాంగ్రెస్‌, బిజెపిలు చేతులు ముడుచుకొని కూర్చోవు కనుక తెరాస ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

వొకవేళ కాంగ్రెస్‌, బిజెపిలలో ఏదో వొక కూటమి పూర్తి మెజార్టీ సాధించి స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగితే ఇక తెరాస అవసరమే ఉండదు. అప్పుడు తెరాస వద్ద 16 ఎంపీలున్నా చేయగలింది ఏమీ ఉండకపోవచ్చు. కనుక లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌, బిజెపిలతో చేతులు కలపకుండా సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ఏవిధంగా చక్రం తిప్పుతారో చూడాలి.