తెరాస నేతలపై దుష్ప్రచారం చేస్తున్న రేవంత్‌

SMTV Desk 2018-11-16 14:19:07  Revanth Reddy, Congress, Telangana Elections, TRS Leaders

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈ మధ్య కొడంగల్ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ ‘డిసెంబరు 7వ తేదీన పోలింగ్ జరిగేలోగా ఇద్దరు తెరాస ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రకటించడంతో తెరాసలో కలకలం మొదలైంది. రేవంత్‌రెడ్డి ఎవరి పేర్లు చెప్పనప్పటికీ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ తాము తెరాసను వీడబోవట్లేదని ప్రకటించడం రేవంత్‌రెడ్డి వాదనకు బలం చేకూర్చినట్లయింది.

వారిరువురూ మంత్రి కేటిఆర్‌ను కలిసి తమకు పార్టీ మారే అవసరం, ఆలోచన రెండూ లేవని రేవంత్‌రెడ్డి తమతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే తమిద్దరిపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని మీడియాలో వస్తున్న వార్తలను వారిరువురూ ఖండించారు. మీడియా మిత్రులు కూడా ఇటువంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు.

అయితే రేవంత్‌రెడ్డి మళ్ళీ నిన్న కూడా ఇద్దరు తెరాస ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, త్వరలోనే అది అందరూ చూస్తారని నమ్మకంగా చెప్పడం విశేషం. ఇంతకీ రేవంత్‌రెడ్డి తెరాస ఎంపీలతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారా లేక నిప్పు లేనిదే పొగరాదన్నట్లు ఆయన చెపుతున్న మాటలు నిజం కాబోతున్నాయా? చూడాలి.