దయానీయంగా మారిన పొన్నాల పరిస్తితి

SMTV Desk 2018-11-16 10:54:05  Ponnala laxmaiah, Congress party, Election ticket

హైదరాబాద్, నవంబర్ 16: మాజీ పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వొకప్పుడు మంత్రిగా పని చేసిన ఈయనకి ఇప్పుడు పోటీ చేయడానికి టికెట్టే దొరకడం లేదు. తాజాగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి తను జనగామ నుండి పోటీ చేయడానికి టికెట్ కావాలని కోరగా దానికి రాహుల్ గాంధీ బదులిస్తూ దానిని టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌కు కేటాయించేశామని, కనుక ఆయనతో మాట్లాడుకొని ఆయన ఇస్తే తీసుకోమని నిర్మొహమాటంగా చెప్పేశారు. మాజీ పిసిసి అధ్యక్షుడుగా చేసిన వ్యక్తికి ఇటువంటి చేదు అనుభవం ఎదురవడం విస్మయం కలిగిస్తుంది.

చివరి ప్రయత్నంగా పొన్నాల తరపున పొంగులేటి సుధాకర్ డిల్లీ నుంచి కోదండరామ్‌తో ఫోన్లో మాట్లాడారు. టిజేఎస్ పార్టీకి సీట్ల కేటాయింపు గురించి డిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు తాను డిల్లీ వస్తున్నానని, అప్పుడు ఈ విషయం మాట్లాడుకొందామని కోదండరామ్‌ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

పొత్తులలో భాగంగా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు కేటాయించడం సహజమే కానీ ఇటువంటి ముఖ్యనేతలు, కీలకమైన స్థానాలను కేటాయించడమే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి, అసమ్మతికి కారణం అవుతోంది. మాజీ పిసిసి అధ్యక్షుడుగా చేసిన పొన్నాల తన టికెట్ కోసం వేరే పార్టీ అధ్యక్షుడుని (కోదండరామ్‌) బ్రతిమాలుకోవలసిరావడం, ఆయన భవిష్యత్ కోదండరామ్‌ చేతిలో ఉండటం చాలా బాధాకరమే. పొన్నాలను బిజెపి ఆహ్వానిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకే అది ఇంతవరకు జనగామ టికెట్ ఎవరికీ కేటాయించలేదని తెలుస్తోంది.