పట్టు బట్టి సాధించిన పొన్నాల

SMTV Desk 2018-11-13 14:29:50  Ponnala laxmaiah, Congress party, K Janareddy, TJS Party, delhi

హైదరాబాద్, నవంబర్ 13: మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఖరారు అయినట్లు కె జానారెడ్డి చెప్పిన అనంతరం తొలి జాబితాలో అతని పేరు లేకపోవడంతో ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లి పెద్ద వద్ద ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కారు. తన సీనియారిటీ, తన పలుకుబడి వివరించారు. చివరికు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దూకే సంకేతాలు కనిపించడంతో అధిష్టానం వెంటనే ఆయనకు జనగామ సీటుకు కేటాయించేసింది.

ఈ రోజు సాయంత్రం వెలువడే రెండో జాబితాలో ఆయన పేరు ఉటుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ సీటును టీజేఎస్ కేటాయిస్తున్నారని, అక్కడి నుంచి ఆ పార్టీ అధినేత కోదండరాం పోటీ చేస్తారని వార్తలు రావడం తెలిసిందే. దీంతో పొన్నాళ్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాకుండా, కోదండరాంకు ఎలా ఇస్తారని నేతలను నిలదీశారు. మీడియా ముందు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో అన్నంత పనీ చేస్తారని హస్తినబాట పట్టారు. జనగామ నుంచి 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్‌గానూ పని చేశారు. బీసీ కూడా అయినా ఆయనను కాదని జనగామను కోదండరాంకు కేటాయించడం సరికాదని పలువురు నేతలు కూడా అధిష్టానికి వివరించారు.