రాజమౌళి ‘RRR’ ప్రారంభం

SMTV Desk 2018-11-11 17:04:13  rajamouli. rrr, ram charan, ntr

‘బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి ఏం చెయ్యబోతున్నాడనేది చాలా రోజులుగా ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ. గత కొంతకాలంగా రాంచరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ వారినుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈక్రమంలో కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు రాజమౌళి తెరదించారు. 11.11.11 ను సెంటిమెంటుగా భావించి సినిమా ప్రారంభోత్సవానికి పూనుకున్నాడు.

11వ తేదీ, ఉదయం 11గంటల సమయం, 11వ నెల సెంటిమెంటుతో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యారు. రానాతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కొద్ది రోజులుగా ట్రైనర్ స్టీవ్స్‌ లాయిడ్‌ ఆధ్వర్యంలో క‌స‌ర‌త్తులు చేస్తున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

పూజా కార్య‌క్రమంలో చిత్ర క్లాప్ బోర్డ్ ఉంచ‌గా, దానిపై ఆర్ఆర్ఆర్ అని మాత్ర‌మే రాసి ఉంది. దీంతో అంద‌రు ‘రామ రావణ రాజ్యం అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌నే చిత్రానికి పెట్టి ఉంటార‌ని భావిస్తున్నారు. కీరవాణి చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రంలో ఓ క‌థానాయిక‌గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుండ‌గా, మ‌రో హీరోయిన్ స‌మంత అని అంటున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా రాజమౌళి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని స‌మాచారం.