కుటుంబపాలన సాగిస్తున్న తెలంగాణ సీఎం - స్మృతీ ఇరానీ

SMTV Desk 2018-11-05 11:15:32  Central Minister, Smruthi Irani, K Chandra Shekar Rao, BJP, Kishan Reddy

హైదరాబాద్, నవంబర్ 5: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ హైదరాబాద్‌లో అంబర్ పేట నుండి బిజెపి తరపున శాసనసభకు పోటీ చేయబోతున్న కిషన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడానికి తను ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు. అంబర్ పేటలో ఆమె పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, “ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసమే పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్నారు. కానీ గత నాలుగున్నారేళ్లుగా రాష్ట్రం కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిపోయింది. కేసీఆర్‌ వొక నియంతలా వ్యవహరిస్తూ రాష్ట్రంలో కుటుంబపాలన సాగిస్తున్నారు. కనుక డిసెంబరు 7న జరుగబోయే ఎన్నికలలో కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులను, తెరాసను ఓడించడానికి బిజెపి శ్రేణులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. అంబర్ పేట నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డిని బారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరూ గట్టిగా కృషి చేయాలి.

దేశంలో సామాన్యప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారతి వంటి అనేక పధకాలను తెరాస ప్రభుత్వం అమలుచేయడానికి ఇష్టపడటం లేదు. వాటిని యధాతధంగా అమలుచేస్తే ప్రధాని నరేంద్ర మోడీకి ఆ క్రెడిట్ దక్కుతుందనే భయంతోనే అమలుచేయడం లేదు. కానీ యావత్ దేశ ప్రజలు ప్రధాని నరేంద్రమోడీ పాలన ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి జేజేలు పలుకుతున్నారు. డిసెంబరు 7న జరుగబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు బిజెపికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్నప్తి చేస్తున్నాను,” అని అన్నారు.