నేడు రాహుల్ తో ఏపీ సీఎం భేటి

SMTV Desk 2018-11-01 12:18:29  Andrapradesh, New Delhi, TDP, Congress, Rahul Gandhi, Chandra babu naidu

న్యూ ఢిల్లీ, నవంబర్ 1: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలతో మహాకూటమిని ఏర్పాటు చేయడానికి సిద్దమవుతున్నారు. ఆ నేపథ్యంలో భాగంగా నేడు ఆయన డిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్‌ తదితర ప్రతిపక్ష నేతలతో సమావేశం కాబోతున్నారు. ఆయన ఇతర పార్టీల నేతలను కలవడం పెద్ద విచిత్రమేమీ కాదు కానీ నేరుగా రాహుల్ గాంధీతో భేటీ కావడమే పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపాలనుకొన్నప్పుడే చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయాలనే ఆలోచన కలిగి ఉండవచ్చు. కానీ కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తే ప్రజలు ఏవిదంగా స్పందిస్తారో? అనే భయంతో ఇంతకాలం మౌనం వహించారు. టిడిపి భయాలను ఏపీ కాంగ్రెస్‌ అర్ధం చేసుకొంది కనుకనే తెలంగాణలో దోస్తీ నేపద్యంలో టిడిపిపై విమర్శలు చేయడం మానుకొంది.

అయితే ఏపీలో కాంగ్రెస్‌-టిడిపిల దోస్తీ కోసమే రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితం హడావుడిగా అనంతపురంలో బహిరంగసభలో పాల్గొని ‘కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని’ ప్రకటన చేశారు. ప్రస్తుతం టిడిపి దాని కోసమే కేంద్రంతో పోరాడుతోంది కనుక అది ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయడం తప్పు కాదని సమర్ధించుకోగలదు కూడా. కనుక జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియదు కానీ రాహుల్ గాంధీతో ఈరోజు భేటీ తరువాత ఏపీలో కూడా కాంగ్రెస్‌-టిడిపిలు కలిసిపనిచేయడానికి మార్గం సుగమం అయినట్లే.