అమెరికాలో మనవాళ్ళకి కష్టాలు తప్పవిక

SMTV Desk 2018-10-31 13:49:55  Donald trump, America president, Green card

వాషింగ్టన్‌, అక్టోబర్ 31: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ నివాసముంటున్న భారతీయుల మీద ఉదృత మరింత తీవ్రతరమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే హెచ్-1 బి, హెచ్-4 వీసాలు, గ్రీన్ కార్డ్ మంజూరుపై అనేక ఆంక్షలు విధిస్తూ అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకొనేవారికి, అక్కడ స్థిరపడినవారికీ మనశాంతి లేకుండా చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య వొక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయుల పై మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

అమెరికాలో పుట్టినవారెవరికైనా సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుందని అమెరికా రాజ్యాంగంలో 14వ అమెండ్ మెంట్ స్పష్టంగా పేర్కొంటోంది. కానీ అది సరికాదని, అమెరికా పౌరులుకాని వారికి అంటే హెచ్-1బి తదితర వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు పుట్టిన పిల్లలకు, అలాగే అక్రమంగా అమెరికాలో ప్రవేశించి స్థిరపడినవారి పిల్లలకు అమెరికా పౌరసత్వం మంజూరు చేయనవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “విదేశీయులు ఇక్కడకు వచ్చి పిల్లలను కంటే వారికి అమెరికా పౌరసత్వం కల్పించే వెసులుబాటు కేవలం మన అమెరికాలో మాత్రమే ఉంది. దానితో పాటు వొక అమెరికన్ పౌరుడికి లభించే అన్ని హక్కులు, పధకాలు ఆ పిల్లలకు అడగకుండానే లభిస్తాయి. కనుక దీనిని తక్షణం రద్దు చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రతిపాదనపై రాజ్యాంగ, న్యాయనిపుణులు అధ్యయనం చేస్తున్నారు. వారు తమ నివేదిక సమర్పించిన వెంటనే ఇటువంటి పౌరసత్వాలు మంజూరు చేయకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై నేను సంతకం చేయబోతున్నాను,” అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

దీనిపై అప్పుడే ప్రతిపక్ష నేతలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీనిని అడ్డుకొనేందుకు కోర్టులలో పిటిషన్లు దాఖలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ట్రంప్ వెనక్కు తగ్గే రకం కాదని ఇప్పటికే పలుమార్లు నిరూపించి చూపారు. కనుక దీనిపై కూడా వెనక్కు తగ్గకపోవచ్చు.
త్వరలో జరుగబోతున్న వివిద రాష్ట్రాల గవర్నర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ట్రంప్ ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ‘అమెరికా ఫస్ట్...అమెరికన్స్ ఫస్ట్’ అనే నినాదంతో అమెరికా ప్రజలలో సెంటిమెంటు రాజేసి తాను ఏవిధంగా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించారో, మళ్ళీ ఇప్పుడూ అదేవిధంగా దీనితో సెంటిమెంటు రాజేసి తన పార్టీకి విజయం సాధించి పెట్టాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లున్నారు. కానీ ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చినట్లయితే అమెరికాలో విదేశీయులకు పుట్టబోయే బిడ్డల భవిష్యత్ అంధకారం అవుతుంది.