దీపావళి టపాసులు లేకుండానా .. !

SMTV Desk 2018-10-23 15:19:50  Delhi, supreme court , Diwali , Firecrackers

ఢిల్లి , అక్టోబర్ 23 ; బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. పటాసుల అమ్మకాలపై నిషేధం విధించలేమని, అయితే విక్రయాలపై కొన్ని షరతులు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఇక దీపావళి పండగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా బాణసంచా విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది.

దీపావళి పండగ అంటేనే టపాసుల మోత. అయితే ఇలా పెద్దమొత్తంలో బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొద్ది రోజుల్లో దీపావళి పండగ రానున్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరిచింది. బాణసంచా విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఇక భారీ శబ్ధాలు.. పర్యావరణానికి హాని కలిగించే టపాసుల్ని అమ్మకూడదని ఆదేశించింది. అది కూడా శబ్ధం తక్కువ డెసిబెల్స్‌లో ఉండాలని సూచించింది. లైసెన్స్ ఉన్న షాపుల్లోనే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ తీర్పు కేవలం దీపావళి పండగకు మాత్రమే మరికొన్ని పండగలు, శుభకార్యాలకు వర్తిస్తుందని తెలిపింది. ప్రజలంతా కలిసి కమ్యూనిటీగా బాణసంచా పేల్చడాన్ని కేంద్రం ప్రోత్సహించాలని సూచించింది.