'అరవింద సమేత’ కోట్లు కొల్లగొట్టింది!

SMTV Desk 2018-10-12 16:19:32  Jr NTR , POOJA HEGDE , JAGAPATI BABU , TRIVIKRAM , THAMAN

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘అరవింద సమేత’ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం నాన్‌ ‘బాహుబలి’ రికార్డును సృష్టించినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ‘బాహుబలి’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రమిదని తెలిపారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.60 కోట్లు కొల్లగొట్టిందని విశ్లేషకులు చెప్పారు. ఇది సరికొత్త రికార్డని పేర్కొన్నారు. ఈ చిత్రం కేవలం తెలంగాణలో మొదటి రోజున రూ.8.30 కోట్లు (గ్రాస్‌) రాబట్టినట్లు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

అంతేకాదు ఈ చిత్రం విదేశాల్లోనూ అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. అమెరికాలో ఇప్పటికే మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా రెండు మిలియన్‌ డాలర్లవైపు అడుగులు వేసింది. చిత్రం ఆస్ట్రేలియాలో టాప్‌-10 జాబితాలో చేరింది. గురువారం అక్కడ 35 లొకేషన్లలో రూ.67.63 లక్షలు రాబట్టిందని విశ్లేషకులు తెలిపారు. వారాంతంలో సినిమా అధిక కలెక్షన్స్‌ రాబట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘అరవింద సమేత’. పూజా హెగ్డే కథానాయిక. జగపతిబాబు, సునీల్‌, ఈషా రెబ్బా, నాగబాబు, సితార, రావు రమేశ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. తమన్‌ బాణీలు అందించారు. ‘వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అనే పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం చిత్ర బృందాన్ని ప్రశంసించారు.