సైనా నెహ్వాల్‌ ఫస్ట్‌లుక్‌

SMTV Desk 2018-09-29 18:22:13  Saina Nehwal first look, Saina Nehwal,

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా బయోపిక్‌ ‘సైనా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధా కపూర్‌ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమాకి అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ బయోపిక్‌లో శ్రద్ధ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో శ్రద్ధ క్రీడాకారిణిగా కనిపించి మెప్పించారు. అచ్చం సైనాలాగే ఉన్నారని సోషల్‌మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం శ్రద్ధ చాలా కష్టపడ్డారు. గత కొన్ని నెలలుగా బ్యాడ్మింటన్‌ క్రీడ నేర్చుకుంటున్నారు. ‘ఇప్పటికే ఈ సినిమా కోసం 40 బ్యాడ్మింటన్‌ తరగతులకు హాజరయ్యా. నిజంగా ఇది చాలా కష్టమైన క్రీడ, కానీ నేను దీన్ని ఎంజాయ్‌ చేస్తున్నా. ఓ క్రీడాకారిణి జీవితం గురించి తెలుసుకోవడం నిజంగా చాలా అద్భుతమైన అనుభూతి. సైనా విజయాలు, అపజయాలు, గాయాలు.. ఇలా ఆమె ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేను కూడా నా వృత్తిలో ఇలాంటి అనుభవాలను చూశాను. ఎన్ని జరిగినా సైనా తన దృష్టి వేరేదానిపై పెట్టకుండా పట్టుదలతో కృషి చేయడం గొప్ప విషయం’ అని శ్రద్ధ ఈ చిత్రం గురించి మీడియాతో చెప్పారు.