ఫిల్మ్ డైరెక్టర్ పూరీని విచారిస్తున్న సిట్

SMTV Desk 2017-07-19 13:28:16  film directer poori jagannath, Excise Department,Inquiry

హైదరాబాద్, జూలై 19 : నగరంలో గత కొంత కాలంగా సంచలనం రేపిన డ్రగ్స్ విషయంలో సీని పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖుల పాత్ర ఉన్నట్లు తెలుసుకున్న ఎక్స్ సైజ్ శాఖ వారిపై కేసు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడ్డ ఫిల్మ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. నాంపల్లిలో ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు పూరీని విచారించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సినీ ప్రముఖులు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆబ్కారీ శాఖ కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరందరిని రోజుకు ఒక్కొక్కరు చొప్పున ఆగస్టు 2 వరకు సిట్‌ అధికారులు విచారించనున్నారు. డ్ర‌గ్ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ఆబ్కారీ ఆఫీసుకు రావాలంటూ పూరీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ప్రకారమే ఆయన ఇవాళ ముందుగానే ఆఫీసుకు చేరుకున్నాడు. పూరీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడు, ఆయన తరపున న్యాయవాది కూడా సిట్ ఆఫీసుకు వచ్చారు. నగరంలో కొకైన్‌, హెరైన్ లాంటి మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అమ్ముతున్న కెల్విన్‌తో పూరీకి ఎటువంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో సిట్ అధికారులు విచారణ జ‌ర‌ప‌నున్నారు. విచారణ నేపథ్యంలో ఎక్సైజ్‌ ఆఫీసు దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేయనున్నారు. తమ వద్ద నున్న వివరాల ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు ఓ ప్రశ్నాపత్రం రూపొందించారు. ఎక్సైజ్ శాఖలోని సెక్షన్ 67 ప్రకారం పూరీని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. కెల్విన్‌తో పూరీ వాట్సాప్ ద్వారా సంబంధాలు కొనసాగించాడు. అయితే ఆ అంశాన్ని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. పూరీ జగన్నాథ్‌కు సుదీర్ఘ ఫిల్మ్ కెరీర్ ఉన్న నేపథ్యంలో ఆయనపై సిట్ అధికారులు లోతుగానే ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి.