విద్యార్థులకు సంచి మోత నుంచి విముక్తి

SMTV Desk 2017-07-19 12:03:41  school bags, telangana state, books wheight

హైదరాబాద్, జూలై 19 : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మండలి కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పోరేట్ పాఠ్యపుస్తకాల బరువు ను ప్రభుత్వం తగ్గించింది. సంచి బరువు విద్యార్థులకు శాపంగా మారుతున్న నేపథ్యంలో తరగతుల వారీగా పుస్తకాల సంచి గరిష్ఠ బరువు ఎంతో పేర్కొంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయించి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా సర్వే నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ప్రాథమిక స్థాయిలో 6-12 కిలోలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 12-17 కిలోలు చొప్పున గుర్తించారు. ఇది పిల్లల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, వెన్నెముక, మోకాళ్లపై భారం పడి అవి దెబ్బతింటాయన్న నిర్ధారణకు వచ్చారు. దీనికి కారణం విద్యార్థులు ప్రతిరోజూ పాఠ్య పుస్తకాలతోపాటు. నోటు పుస్తకాలు, గైడ్లు, హోంవర్క్‌ తాలూకూ పుస్తకాలు తీసుకెళ్తుండటమే కారణమని గుర్తించారు. దీనికి విరుగుడుగా విద్యాశాఖ విడుదల చేసిన తాజా నిబంధనల్లో భాగంగా.. 1, 2 తరగతుల విద్యార్థులకు 1.5 కిలోలకు మించకుండా స్కూల్ బ్యాగ్ ఉండాలని నిర్ధారించింది. 3, 4, 5 తరగతులు పిల్లల బ్యాగులు 2 నుంచి 3 కిలోల వరకు, 6, 7 తరగతుల వారికి 4 కిలోలు, 8, 9 తరగతుల వారికి 4.5 కిలోలు, 10వ తరగతి విద్యార్థులకు 5 కిలోలకు మించి స్కూల్‌ బ్యాగు బరువు ఉండొద్దని ప్రభుత్వం స్పష్టంచేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు మార్గదర్శకాలు # రాష్ట్ర అకడమిక్‌ అథారిటీ లేదా ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలి. # గ్రంథాలయంలోని పుస్తకాలను చదివించాలి. ఆటలు, కళలు, సాంస్కృతిక విభాగాలు, సహ పాఠ్యాంశాల్లో పాల్గొనే లా విద్యార్థులను ప్రోత్సహించాలి. # పాఠశాల సమయాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తీరు సహా అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న అన్ని అంశాలపై అవగాహన ఉండాలి. #రాష్ట్ర పాఠ్య ప్రణాళిక ప్రకారం 6, 7 తరగతులకు 3 భాషలు, గణితం, సైన్స్‌, సాంఘిక శాస్త్రం మొత్తం 6 పాఠ్య పుస్తకాలను మాత్రమే నిర్దేశించారు. #6, 7 తరగతుల పిల్లల పాఠ్య పుస్తకాలు, బ్యాగుతో సహా మొత్తం బరువు 4 కేజీలకు మించరాదు. 8, 9, 10 తరగతుల పిల్లల బ్యాగు బరువు 4.5 నుంచి 5 కేజీల కంటే తక్కువ ఉండాలి. #1, 2 తరగతులకు మాతృభాష, ఇంగ్లీషు, గణితం (మూడు) పాఠ్య పుస్తకాలు; 3,4,5 తరగతులకు ఈ మూడింటి తో పాటు పరిసరాల విజ్ఞానం కలిపి నాలుగు పుస్తకాలు మాత్రమే ఉండాలి. # పిల్లలు ఇంటి నుంచి బాటిల్స్ లో తాగునీరు తెచ్చుకునే అవసరం లేకుండా పాఠశాలలోనే సురక్షిత తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయాలి. #ప్రాథమిక పాఠశాలలు హోం వర్కు ఇవ్వరాదు. స్కూల్‌ బ్యాగుల బరువు తగ్గించడానికి సూచనలు #బ్యాగు బరువు ను సమానంగా పంచే విధంగా వెడల్పు పట్టీలు గల బ్యాగులను ఎంపిక చేసుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెప్పాలి. #విద్యార్థులు అనవసర మెటీరియల్‌ మోసుకురాకుండా తరచూ తనిఖీ చేయాలి. #విద్యార్థులు స్కూల్‌ బ్యాగు రెండు పట్టీలను ఉపయోగించాలి. ఒకే భుజంపై మొత్తం భారం పడే విధంగా బ్యాగు ధరించరాదు.