ఏఎన్నార్‌ 94వ జయంతి: తాతను తలపిస్తున్న సుమంత్‌

SMTV Desk 2018-09-20 11:55:34  ANR Birth Anniversary, NTR Biopic,

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్‌టిఆర్’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్‌ నటిస్తున్నారు. ఈరోజు ఏఎన్నార్‌ 94వ జయంతిని పురస్కరించుకుని సినిమాలోని ఏఎన్నార్‌ లుక్‌ను సుమంత్‌ ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘ఈ రోజు ఏఎన్నార్‌ 94వ జయంతి. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత. సినిమాలో ఇది నా లుక్‌’ అంటూ సుమంత్‌ ట్వీట్‌ చేశారు. ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్ ఒదిగిపోయారు. అదే తలకట్టు, మీసం, కళ్లజోడుతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లేటప్పుడు సుమంత్‌ తన తాతగారు వాడిన ఆఖరి కారులోనే సెట్స్‌కు వెళ్లినట్లు తెలిపాడు. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన దగ్గుబాటి రానా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌, విజయ్‌ సేతుపతి, నాగాబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.