రాజభోగాలకు కళ్ళెం వేసిన అధికారులు

SMTV Desk 2017-07-19 11:23:03  shashikala, jail, tamilnaadu cm, dig roopa, history.

బెంగుళూరు, జూలై 19 : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరు శివారు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో రాజ భోగాల్ని అనుభవిస్తుందన్న నిజాన్ని బయట పెట్టిన డీఐజీ రూప మౌద్గిల్‌ పై బదిలీ వేటు వేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు అక్కడి అవినీతి, అక్రమాలను బయటపెట్టి శశికళ రాజ వైభవానికి తెరదించారు. శశికళ, ఆమె వదిన ఇళవరసి ఖైదీ దుస్తుల్ని ధరించి సాధారణ ఖైదీల్లా మామూలు గదిలో బందీలుగా కాలాన్ని గడుపుతున్నారు. పరమన్నాలకు బదులుగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పులిహోర, పెరుగన్నం, సాంబార్ అన్నం, సంగటి ముద్దనే ఆరగించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. గత వారం ఆమెకు చెరసాలలో ఒక అంతస్తులో ఐదు గదుల్ని కేటాయించగా ఆమె సొంత ఇంట్లో మాదిరి రాజ వైభవాన్ని అనుభవించారు. ఈ నిజాన్ని బయటపెట్టిన డీఐజీ రూప మౌద్గిల్‌ను ప్రస్తుతం సంచార, రహదారి సురక్షిత విభాగాధికారిణిగా నియమించారు. డీఐజీ రూప నూతన బాధ్యతల్ని చేపట్టిన తర్వాత ప్రెస్ మీట్ లో ప్రతినిధులతో మాట్లాడుతూ ‘ఈ వృత్తిలో భావోద్వేగాలకు తావు లేదు. ప్రభుత్వ ఉత్తర్వును పాటిస్తాను’ అని అన్నారు. పరప్పన అగ్రహార చెరసాల అవినీతి, అక్రమాల్ని బహిర్గతం చేసినందుకు పాండిచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి తనను అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా డైరెక్టర్‌ జనరల్‌ రూప్‌కుమార్‌ దత్త బెంగళూరులో ప్రెస్ మీట్ లో పాల్గొని, డీఐజీ రూపను సంచార, రహదారి సురక్షిత విభాగానికి బదిలీ చేయటం కేవలం బదిలీయే తప్ప శిక్ష కాదని పేర్కొన్నారు.