మాపై వందకేసులు పెట్టినా మేము భయపడబోము

SMTV Desk 2018-09-18 10:38:35  Revanth reddy, Congress, TRS, KCR,

కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి నాకు కీలక బాధ్యతలు అప్పగించినట్లయితే టిఆర్ఎస్‌కు చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక నాపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ టిఆర్ఎస్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసినట్లు నా దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉంది. అందుకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి నాపై ఉన్న పాత కేసులను తిరుగదోడి, ఈడి, సిబిఐ, ఆదాయపన్నుశాఖలలో దేనినో ఒక దానిని నాపైకి పంపించబోతున్నట్లు నావద్ద సమాచారం ఉంది. తెలంగాణా ప్రభుత్వం నాపైనా, నా కుటుంబ సభ్యులపై కూడా నిఘా ఉంచి మాపై గూడచర్యానికి పాల్పడుతోంది. త్వరలోనే నన్ను అరెస్ట్ చేయడానికి తెర వెనుక కుట్ర జరుగుతోంది. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఏదైనా జరుగరానిది జరిగితే దానికి రాష్ట్ర డీజిపి మహేందర్ రెడ్డి, నిఘా ఐజి ప్రభాకర్ రావులదే బాధ్యత అని హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కి భయబ్రాంతులను చేసి టిఆర్ఎస్‌ ఎన్నికలలో విజయం సాధించాలని చూస్తోంది. కానీ మాపై వందకేసులు పెట్టినా మేము భయపడబోము,” అని రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌ను హెచ్చరించారు.