టిఆర్ఎస్‌కు బిజెపి గట్టి పోటీనిస్తుంది: బిజెపి జాతీయ అధ్యక్షుడు

SMTV Desk 2018-09-15 17:13:19  BJP, Amit Shah, TRS, KCR,

హైదరాబాద్‌: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ్ళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని మోడీ జమిలి ఎన్నికల ప్రతిపాదన చేసినప్పుడు దానికి మొట్టమొదట మద్దతు పలికిన వ్యక్తి సిఎం కెసిఆరే. అప్పుడు జమిలి ఎన్నికలకు మద్దతు పలికి ఇప్పుడు ముందుగా ఎందుకు ఎన్నికలకు వెళ్లాలనుకొంటున్నారో చెప్పాలి. కెసిఆర్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసమే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని మేము భావిస్తున్నాము. అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంపై ఇంత తక్కువ వ్యవదిలో మరోసారి ఎన్నికల భారం మోపడం సరికాదు. కానీ కెసిఆర్‌ తన పార్టీ ప్రయోజనాలే చూసుకొన్నారు తప్ప రాష్ట్రంపై పడబోయే అధనపు భారం గురించి పట్టించుకోలేదు. బిజెపి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదని కెసిఆర్‌కు తెలిసి ఉన్నప్పటికీ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకొన్నారు. కనుక ఈ ఎన్నికలలో ఎన్నికల తరువాత కూడా కెసిఆర్‌ మళ్ళీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయవచ్చు. ఇక తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందించిన సహాయసహకారాలను అమిత్ షా విలేఖరులకు వివరించిన తరువాత, “పార్టీలు వేరైనా ఫెడరల్ స్పూర్తితో కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తోంది. కెసిఆర్‌ 31 జిల్లాలను ఏర్పాటు చేశారు. కానీ ఏ ఒక్క జిల్లాలోనైనా అభివృద్ధి చేశారా? కెసిఆర్‌ అభివృద్ధి అంతా మాటలకే పరిమితం. కనీసం తను ఇచ్చిన ఎన్నికల హామీలనైనా అమలుచేశారా అంటే అదీ లేదు. 2.5 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. తెలంగాణా ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని 2014 ఎన్నికలలో చెప్పారు కానీ మాట తప్పారు. కనీసం వచ్చే ఎన్నికల తరువాత అయినా చేస్తామని మాట ఇవ్వగలరా? నిజానికి ఆయన తన కుటుంబ పాలనను కొనసాగించేందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. కానీ తెలంగాణా ప్రజలు కుటుంబ పాలన నుంచి విముక్తి కోరుకొంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలకు, బిజెపి-టిఆర్ఎస్‌ రాజకీయాలకు ఎటువంటి సంబంధమూ లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడిననైన నేను స్వయంగా ప్రకటిస్తున్నాను. ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌కు బిజెపి గట్టి పోటీనిస్తుంది. విజయం సాధించడానికి మా ముందు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొంటాము,” అని అమిత్ షా చెప్పారు.