ఇద్దరినీ ఒకే దెబ్బతో కొట్టే అవకాశం: మంత్రి

SMTV Desk 2018-09-12 19:06:52  KTR, Minister, TRS, Hyderabad,

హైదరాబాద్ : తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీతో సహా ఇతర పార్టీల్లో కూడా చేరికల పర్వం కొనసాగుతుంది. టికెట్ రాని ఆశావహులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ సారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ కలిసి మహా కూటమిగా ఏర్పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిగొండ, బషిర్‌బాగ్‌లు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కటయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఓ స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందుందని, ఇద్దరిని ఒకే దెబ్బతో కొట్టే అవకాశం లభించిందన్నారు. 60ఏళ్లుగా రాబందుల్లా ప్రజలను పీక్కుతున్న వాళ్లు కావాలా.. రైతుబంధుగా నిలిచిన టీఆర్ఎస్‌ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కరూ గబ్బర్‌సింగ్‌లు కాలేరని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేది తమ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న తమకు నష్టంలేదన్నారు.