సముద్ర గర్భంలో ఖనిజ సంపద

SMTV Desk 2017-07-18 13:15:05  Mineral, wealth, in, the, ocean, floor

కోల్ కత్తా , జూలై 18 : సముద్ర గర్భంలో లక్షలాది టన్నుల ఖనిజాలు, లోహాలలాంటి అమూల్య సంపద భారత ద్వీపకల్పం చుట్టూ ఉందని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. మంగళూరు, చెన్నై, మన్నార్ బేసిన్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో సముద్ర గర్భాన విలువైన ఖనిజ సంపద ఉందని 2014 లో మొదటి సారి కనిపెట్టారు. ఫాస్టేట్ కలిగిన సున్నపు నిక్షేపాలు, హైడ్రోకార్బన్లు, ముడి ఖనిజ, సూక్ష్మ మూలకాలు, స్పటిక కార్బను సమ్మేళనాలు వంటి సంపద సముద్రంలో ఉన్నాయని అప్పట్లో గుర్తించారు. అయితే వీటిపై మూడేళ్లు గా పరిశోధనలు జరిపిన జీఎస్ ఐ శాస్త్రవేత్తలు ఈ ఖనిజ సంపద పరిమాణాన్ని ఖచ్చితంగా లెక్క కట్ట గలిగారు. సముద్రగర్భంలో 1,81,025 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని అన్నారు. వెయ్యి టన్నుల బరువైన సున్నపు నిక్షేపాలు ప్రత్యేకంగా భారత్ ఆధీనంలోని సముద్ర జలాల్లో ఉండటం విశేషం. కార్వార్, మంగళూరు, చెన్నై తీరాల్లో ఫాస్టేట్ నిక్షేపాలను జీఎస్ ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. తమిళనాడు తీరంలో మన్నారు బేసిన్ కరకట్టల సమీపంలో గ్యాస్ హైడ్రేట్ నిల్వలను కనుగొన్నారు. అండమాన్ దీవుల్లో ఫెర్రో- మాంగనీస్ తో కూడిన కోబాల్ట్, అలాగే లక్షద్వీప్ సమీపాన స్పటిక మాంగనీస్ అపారంగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. సముద్ర రత్నాకర్, సముద్ర కౌస్తుబ్, సముద్ర శౌధికం అనే మూడు నౌకల ద్వార మూడు సంవత్సరాలుగా పరిశోధన చేసారు. అపార ఖనిజ సంపద కనుగొనటం గొప్ప విశేషం. ఇదంతా భారత్ అధీనంలోని సముద్ర భూగర్భంలో ఉండటం సంతోషకరమైన అంశం అని శాస్త్రవేత్తలు అన్నారు.