జింబాబ్వే హెడ్ కోచ్‌గా రాజ్‌పుత్‌

SMTV Desk 2018-08-25 15:01:53  Zimbabwe, Lalchand rajput, Twitter

భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ జింబాబ్వే జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్ల కాలానికి రాజ్‌పుత్‌ను కోచ్‌గా నియమించినట్లు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.ప్రస్తుతం జింబాబ్వేకు తాత్కాలిక కోచ్‌గా ఉన్న రాజ్‌పుత్‌ను పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్టు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ట్విట్టర్‌లో పేర్కొంది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌కు జింబాబ్వే జట్టు అర్హత సాధించకపోవడంతో కోచ్‌గా ఉన్న హీత్‌స్ట్రీక్‌ను తప్పించి రాజ్‌పుత్‌ను తాత్కాలిక కోచ్‌గా జింబాబ్వే బోర్డు నియమించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రాజ్‌పుత్‌ ఇప్పుడు జింబాబ్వేకు పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. భారత్‌ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన 56 ఏళ్ల రాజ్‌పుత్‌ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ‘కోచ్‌గా ఎంపికైనందుకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ఆయన అన్నారు. తొలి టి20 వరల్డ్‌కప్‌ చేజిక్కించుకున్న ధోని సేనకు రాజ్‌పుత్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. గతంలో ఆయన అఫ్గానిస్తాన్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గాను పనిచేశారు. "రాజ్‌పుత్‌ సేవలు జింబాబ్వే జట్టు వినియోగించుకోనుంది. అతని అనుభవం, కష్టపడేతత్వం, ఆటపై ఉన్న మక్కువ మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది" అంటూ జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ట్వీట్‌లో పేర్కొంది.