అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు: సీఎం

SMTV Desk 2018-08-25 14:23:25  CM KCr, Aathma Gaurava Sabha

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీటికోసం నగరంలోని కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లాపూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. వీటితో పాటు వారి సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి, వారి వికాసానికి ఉపయోగపడేవిధంగా ప్రతీ కులానికి హైదరాబాద్ లో ప్రభుత్వమే భవన్లు నిర్మిస్తుంది. ఇందుకోసం అవసమైన స్థలాలు సేకరించాం. నిధులు సిద్ధంగా ఉంచాం. దాదాపు 36 సంచార కులాలకు కలిపి హైదరాబాద్ నగరంలో 10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల వ్యయంతో సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మిస్తాం. సంచార ఆత్మగౌరవ భవన్ లో అన్ని సంచార కులాల వారు తమ అభ్యున్నతి కోసం చేపట్టే కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. పేదలు పెండ్లిళ్లు చేసుకోవడంతో పాటు విద్య, సాంస్కృతిక వికాస కేంద్రంగా అది భాసిల్లుతుంది” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.