ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు

SMTV Desk 2018-07-28 17:05:16  andhra pradesh ,special status of andhra pradesh , n.chandrababunaidu,

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించి తీరుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో చేపట్టిన ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నమ్మక ద్రోహంపై తిరుపతిలో వెంకన్న సాక్షిగా తొలి ధర్మపోరాట పోరాటం నిర్వహించామని, ఇది నాలుగో సభ అని గుర్తు చేశారు. పోరాటానికి పోరాటానికి మధ్య ప్రజల్ని చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలంతా సంఘటిత శక్తిగా తయారవుతున్నారన్నారు. హక్కులను కాపాడుకుంటామని, అడ్డం వస్తే ఎదురు తిరుగుతామని ప్రజలంతా నినదిస్తున్నారని అన్నారు. ఈ పోరాటం సందర్భంగా ఒక్కోసారి కొందరు భావావేశానికి లోనై త్యాగాలు చేయాలనే ఉద్దేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లిలో సుధాకర్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు హోదా రాలేదు. న్యాయం జరగలేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని లేఖ రాసి చనిపోయాడని అన్నారు. అంతకుముందు ఆయన ఓ అనాధ ఆశ్రమానికి రూ.5వేలు డొనేషన్‌గా ఇచ్చాడని సీఎం తెలిపారు. పేద కుటుంబంలో పుట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, బావితరాల భవిష్యత్తు కోసం ప్రాణాలర్పించాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఈ సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.