తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

SMTV Desk 2018-07-27 17:24:50  Telangana, High court, Komat reddy venkareddy, MLA

తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు శుక్రవారం సీరియస్ అయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసన సభ్యత్వ రద్దుపై కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇంతకుముందే తీర్పు ఇచ్చింది. అయితే, ఆ తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. వారిని ఎమ్మెల్యేలుగా పరిగణించడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంపై వారు కోర్టు ధిక్కారణ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను శుక్రవారం విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.మీరు ప్రభుత్వ న్యాయవాదా లేక పార్టీ తరఫు న్యాయవాదా అని అడిషనల్ ఏజీ రామచంద్ర రావును హైకోర్టు ప్రశ్నించింది. వారం రోజుల్లోగా హైకోర్టు తీర్పుపై స్పందించాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది. లేదంటే అసెంబ్లీ కార్యదర్శి, సెక్రటరీ నేరుగా కోర్టుకు రావాల్సి ఉంటుందని సీరియస్ అయింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.