రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం...

SMTV Desk 2017-07-17 11:15:04  india president, meerakumar, kovindh, oters, delhi, elections today

హైదరాబాద్, జూలై 17 : భారత దేశ అత్యున్నత 14వ రాష్ట్రపతి పదవి ఎన్నికల సందర్భంగా సోమవారం దేశ వ్యాప్తంగా 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఓటర్లు ఉదయం 10 నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎన్డీయే తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌ బరిలో ఉండగా యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్‌ పోటీ చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా కరుణానిధి ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ ప్రకటించారు. ఈ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పత్రాలపై ఓట్లు వేస్తారు. శాసనసభ్యుల కోసం గులాబీ రంగులో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. కేవలం ఈసీ సరఫరా చేసే ప్రత్యేక కలాలతో నమోదు చేస్తేనే ఓట్లు చెల్లుతాయి. దీనికి వీలుగా ఓటర్లు ఆయా పోలింగ్‌ కేంద్రాల లోపలకి వెళ్లే సమయంలోనే వారి వద్ద ఉండే వ్యక్తిగత కలాలను పోలింగ్‌ సిబ్బంది తీసుకుని వీటిని అందిస్తారు. గత రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి రాష్ట్రపతి ఎన్నికకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ పోలింగ్ పర్యవేక్షణకు 33 మంది పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. ఎంపీలంతా పార్లమెంట్ ప్రాంగణంలోనే ఓట్లు వేయాల్సి ఉంది. వీరిలో 55 మంది మాత్రం ఈసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని తమకు అందుబాటులో ఉన్న రాష్ట్రాల శాసనసభల్లో ఓట్లు వేయబోతున్నారు. వీరిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ ముగ్గురు ఇంకా ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఐదుగురు శాసనసభ్యులు పార్లమెంట్ భవనంలో, నలుగురు శాసనసభ్యులు తాము ఎన్నికైన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలోని శాసనసభల్లో ఓట్లు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో శాసన కర్తలు వేరే ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు హక్కు ఉంది. ఈసారి 14 మంది రాజ్యసభ సభ్యులకు, 41 మంది లోక్‌సభ సభ్యులకు ఇలాంటి వెసులుబాటును కల్పించారు. అన్ని చోట్ల నుంచి బ్యాలెట్‌ పెట్టెల్ని ఢిల్లీకి తీసుకువచ్చి, ఈ నెల 20న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఓటర్లు 4896 మంది, రాష్ట్రపతిని ఎన్నుకునే అర్హత 4896 మంది ప్రజా ప్రతినిధులకు ఉంది. నామినేటెడ్‌ సభ్యులు మినహా మిగిలిన చట్టసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు.