రేషన్ డీలర్ల వ్యవస్థను నిర్విర్యం చేస్తున్న ప్రభుత్వం

SMTV Desk 2017-05-29 19:02:22  ration shop,rice, ap ration shop,

తాడేపల్లిగూడెం, మే 29 : ప్రస్తుత ప్రభుత్వ వైఖరి వల్ల రేషన్ డీలర్ల పరిస్థితి మరింత దుర్భరమైందని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు టి.ఎ.వి.ఎల్.నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేసారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా ఇచ్చే పంచదార, కిరోసిన్ సరఫరా ఈ నెల నుంచి ప్రభుత్వం నిలిపివేయడంతో రేషన్ షాపులు బియ్యం కొట్లుగా మారాయని అన్నారు. దీంతో రేషన్ డీలర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెం గమిని ఫంక్షన్ హాలులో ఈరోజు జరిగిన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర సదస్సులో రేషన్ డీలర్ల సమస్యలను ఆయన ఏకరవు పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదముందని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవస్థను నమ్ముకుని పనిచేస్తున్న డీలర్లు జీవన భృతి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. చాలీచాలని కమీషన్లు ఇచ్చినా రేషన్ డీలర్లంతా ఎన్నో వ్యయ ప్రయాసలతో చౌక ధరల ప్రజా పంపిణీకి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారన్నారు. అటువంటి తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్లకు పని, ఆహార భద్రతా కల్పించాలని కోరారు. న్యాయమైన కోర్కెల పరిష్కారానికి దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. వచ్చే నెల 5వ తేదీన మండలస్థాయిలో మండల అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని, మరలా 12న జిల్లాస్థాయి అధికారులకు వినతిపత్రాలు ఇస్తామని, అదేవిధంగా 18న ఆయా నియోజకవర్గాలలో ఉన్నశాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రి వర్యులకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. చివరిగా 27న చలో సచివాలయం కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి వర్యులకు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29వేల రేషన్ డీలర్లు పాల్గొని డీలర్ల హక్కులు కాపాడుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు పిలుపునిచ్చారు.