ఓ సాధువును గూండాలాగా పరిగణిస్తారా..? : స్వామి

SMTV Desk 2018-07-19 19:15:22  telangana government, bjp leader subramanyam, trs, bjp, delhi

ఢిల్లీ, జూలై 19 : స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామీజీని బహిష్కరించడంపై ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై లేఖాస్త్రం సంధించారు. ఇలాంటి నగర బహిష్కరణ ఆదేశాల వల్ల స్వామీజీ ప్రాథమిక హక్కులను కాలరాశారని అన్నారు. ఓ సాధువు పట్ల ఈ విధంగా ప్రవర్తించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో వెల్లడించారు. స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఆదేశాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. నష్టపరిహారం కోరతానని పేర్కొన్నారు. ఓ సాధువును గూండాలాగా పరిగణిస్తారా? అని ప్రశ్నించారు. దీని వల్ల స్వామీజీ పరువుకు నష్టం కలగదా? అని అన్నారు. ఇది చాలా అవమానకరమైన, అగౌరవకరమైన, పరువు నష్టం కలిగించే చర్య అని స్వామి లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని స్వామి లేఖలో వెల్లడించారు. గతంలో పరిపూర్ణానంద స్వామి ఓ సమావేశంలో చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు ప్రకటించారు.