అవిశ్వాసంపై లోకసభలో శుక్రవారం చర్చ..

SMTV Desk 2018-07-18 15:27:40  no confidence motion, no confidence motion tdp, parliament, loksabha,

ఢిల్లీ, జూలై 18 : ఏపీకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. దీనిపై శుక్రవారం (జులై 20) చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిశ్వాసంపై చర్చ చేపడతామని తెలిపారు. రాజ్యసభలో సోమవారం ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బుధవారం సభ ప్రారంభమవగానే టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం అందిందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. తీర్మానంపై చర్చకు 50 మందికిపైగా సభ్యులు మద్దతుగా లేచి నిలబడటంతో స్పీకర్‌ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. మరోవైపు.. టీడీపీ, బీజేపీ కుమ్మక్కై అవిశ్వాస నాటకానికి తెరలేపారని వైఎస్సార్‌ సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల మొదటి రోజే అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ అమోదించడం చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోందని వారు చెప్పారు. గత సెషన్‌లో తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండానే సమావేశాలను వాయిదా వేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలకు బాగా తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.