సారథిగా విరాట్ తొలి సిరీస్ ఓటమి..

SMTV Desk 2018-07-18 11:49:50  virat kohli, england vs india, ms dhoni, kohli odi series

లీడ్స్‌, జూలై 18 : మిస్టర్ కూల్ ధోని నుండి నాయకత్వ భాద్యతలు తీసుకున్న తర్వాత విరాట్‌ కోహ్లీ తొలి వన్డే సిరీస్‌ ఓటమిని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఓటమితో సిరీస్‌ను కోల్పోయింది. కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నఅనంతరం భారత్‌ వన్డే సిరీస్‌ ఓడిపోవడం ఇదే మొదటిసారి. అలాగే భారత్‌ 2016 తర్వాత వన్డే సిరీస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి. సిరీస్‌ నిర్ణయాత్మక వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో వన్డేల్లో టీమిండియా సిరీస్‌ విజయయాత్రకు తెరపడింది. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ గెలిచి వరుసగా 10 వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా సరసన నిలవాలనుకున్న భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. 2016లో జింబాబ్వేపై 3-0తో సిరీస్‌ గెలిచిన భారత్‌ వరుసగా న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై ద్వైపాక్షిక సిరీస్‌లను సొంతం చేసుకుంది. 2017లో విరాట్‌ కోహ్లీ.. ధోనీ నుంచి పరిమిత ఓవర్ల భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌ బాధ్యతలను అందుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది తొలి వన్డే సిరీస్‌ ఓటమి కావడం విశేషం. ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌ వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. కీలకమైన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆగస్టు 1 నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్‌ గడ్డపై భారత్‌ ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ను గెలవలేదు. ఈ సారైనా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందేమో చూడాలి.