అత్యంత సంపన్నుడిగా జెఫ్‌ బెజోస్‌ ..

SMTV Desk 2018-07-17 13:52:00  Jeff Bezos, amazon chief jeff bezos, billgates, forbes list

న్యూయార్క్, జూలై 17 ‌: అమెజాన్‌ అధినేత, అపర కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 150 బిలియన్‌ డాలర్లను దాటింది. దీంతో ఈ ఆధునిక ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఏకైక వ్యక్తిగా జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. 1982లో ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాను ప్రారంభించిన నాటి నుంచి ఇంత మొత్తంలో సంపద కలిగిన ఒకే ఒక్క వ్యక్తి బెజోస్‌ కావడం విశేషం. అమెజాన్‌ 36 గంటల ప్రైమ్‌ డే సేల్స్‌ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో బెజోస్‌ ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. బెజోస్ ముందు వరకు బిల్‌గేట్స్‌ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉండేవారు. 1999లోనే ఆయన సంపద 100 బిలియన్‌ డాలర్లను తాకింది. అయితే బిల్‌గేట్స్‌ తన సంపదలో చాలా భాగం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చేశారు. దీంతో ఆయన రెండోస్థానానికి వెళ్లిపోయారు. లేదంటే నేటికి ఆయన సంపద కూడా 150 బిలియన్‌ డాలర్లు దాటి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం అమెజాన్‌ షేరు విలువ రికార్డు స్థాయిలో 1,841.95 డాలర్లకు దూసుకెళ్లింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 0.5శాతం పెరిగి 1,822.49 డాలర్ల వద్ద స్థిరపడింది. దీంతో జెఫ్ బెజోస్‌ సంపద అమాంతం పెరిగి 150 బిలియన్‌ డాలర్లను దాటింది. ఈ ఒక్క ఏడాదిలోనే బెజోస్‌ సంపద 52 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఇక బెజోస్‌ తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ 95.3 బిలియన్‌ డాలర్లతో రెండోస్థానంలో ఉన్నారు.