గోల్కొండ బోనాలు ఆరంభం..

SMTV Desk 2018-07-15 15:21:18  telangana bonalu, golconda bonalu festival, hyderabad, minister talasani yadav

హైదరాబాద్‌, జూలై 15 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు జంట నగరాల్లో ఘనంగా ఆరంభమయ్యాయి. గోల్కొండ కోటపై కొలువై ఉన్న శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, పద్మారావులు పట్టువస్త్రాలు సమర్పించారు. లంగర్ హౌజ్‌ నుంచి తొట్టెల ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది. బోనాలు విజయవంతంగా జరగడానికి వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అమ్మవారి వేషధారణలో వివిధ కళారూపాలను ప్రదర్శించిన కళాకారులు అందరిని ఆకట్టుకున్నారు. శాంతిభద్రతల పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. ప్రభుత్వపరంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని చెప్పారు. అధికారిక పండుగగా ప్రకటించిన తర్వాత ప్రజలకు బోనాల పండుగ మరింత ఘనంగా జరుగుతోందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే బోనాలు జరుపుకుంటారని తెలిపారు.