గోదావరి పడవ ప్రమాదంపై.. మంత్రి గంటా దిగ్భ్రాంతి..

SMTV Desk 2018-07-15 12:48:27  east godavari boat accident, ganta srinivas rao, vishakhapatnam, amaravathi

విశాఖపట్నం, జూలై 15 : తూర్పు గోదావరి జిల్లాలో శనివారం జరిగిన పడవ బోల్తా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పాఠశాల విద్యార్ధులు గల్లంతు కావడం చాలా బాధాకరమని అన్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులు పొడిగించిన నేపధ్యంలో సిలబస్ పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే రెండో శనివారం పాఠశాలను తెరవాలని నిర్ణయించామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలకు వాతావరణం ప్రతిబంధకంగా మారింది. గోదావరి పోటుతో ఉండటం, వర్షం కురుస్తుండటంతో సహాయచర్యలకు అంతరాయం ఏర్పడింది. అయినా సరే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లైంతన వారి కోసం నదిలో ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం కూడా ఘటనా స్థలానికి చేరుకుంటారు. గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేకపోవచ్చని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద 40 మందితో గోదావరి దాటుతున్న పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులు, ఓ గృహిణి ఉన్నారు.