ఫిఫా-2018 -ఫైనల్ : విశ్వవిజేత ఎవరు..?

SMTV Desk 2018-07-15 11:55:14  #fifa-2018 final, fifa final-2018, croatia vs france, russia

మాస్కో, జూలై 14 : ఫిఫా ప్రపంచ కప్ -2018 అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఎంతో ఉత్కంఠగా సాగింది. దిగ్గజ జట్లు జర్మనీ, బ్రెజిలే, స్పెయిన్‌, అర్జెంటీనా, ఉరుగ్వే, టోర్నీ నుండి వైదొలిగాయి. దీంతో సూపర్‌ స్టార్లందరూ తట్టాబుట్టా సర్దుకుని స్వదేశానికి చేరిపోయారు. చివరకు ఎవరూ ఉహించని విధంగా ఫ్రాన్స్, క్రోయేషియా జట్లు ఫైనల్ కు చేరాయి. కాగా ఈ రోజు జరిగే చివరి సమరంలో ఎవరు విజేతగా నిలుస్తారో అని ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఫ్రాన్స్‌ జట్టులో కిలియన్‌ ఎంబపెనే, గ్రీజ్‌మన్‌, పోగ్బానే వంటి స్టార్ లు ఉన్నారు. సంచలన విజయాలతో ఫైనల్ పోరుకు దూసుకువచ్చిన క్రొయేషియా టీంలో కెప్టెన్ మోద్రిచ్‌, మోంజుకిచ్‌, ఇవాన్‌ పెరిసిచ్‌లతో ఆ జట్టు బరిలోకి దిగుతుంది. బలాబలాలు, చరిత్ర చూస్తే ఫైనల్లో ఫ్రాన్సే ఫేవరెట్‌. మామూలుగానే ఫ్రాన్స్‌ పెద్ద జట్టు. ఆ జట్టుకు ప్రపంచకప్‌ గెలిచిన అనుభవముంది. ఫ్రాన్స్‌కిది మూడో ఫైనల్‌. ఇటు ఎటాకింగ్‌లో, అటు డిఫెన్స్‌లో ఫ్రాన్స్‌కు తిరుగులేదు. అలాగని క్రొయేషియాను తక్కువ అంచనా వేయలేం. అర్జెంటీనా, ఇంగ్లాండ్‌ జట్లు క్రొయేషియా చేతిలో చావుదెబ్బ తిన్నాయి. రెండుసార్లు పెనాల్టీల్లో గెలవడం.. ఇంగ్లాండ్‌ లాంటి జట్టుపై 0-1తో వెనుకబడి కూడా గెలవడం అద్భుతం అనే చెప్పాలి. ఈ చిన్న దేశం ప్రదర్శనకు ముగ్ధులైన ఎన్నో దేశాల అభిమానులు ఆ జట్టు వైపే ఉన్నారు. క్రొయేషియా ఇప్పుడు ప్రపంచం మెచ్చిన జట్టు. ఈ మద్దతుతో క్రొయేషియా మరోసారి అద్భుతం చేస్తుందేమో చూడాలి. సెంటిమెంట్ పరంగా చూస్తే క్రొయేషియా గెలిచే అవకాశం ఉంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో 20 ఏళ్లకోసారి కొత్త ఛాంపియన్‌ అవతరిస్తుందని చరిత్ర చెబుతోంది. 1958లో బ్రెజిల్‌ జట్టు తొలిసారిగా ప్రపంచకప్‌ అందుకుంది. 20 ఏళ్ల తర్వాత అర్జెంటీనా కప్పు గెలిచింది. ఇంకో 20 ఏళ్లకు ఫ్రాన్స్‌ విజేతగా నిలిచింది. ఇదే కోవలో ఇప్పుడు క్రొయేషియా కొత్త ఛాంపియన్‌ అవుతుందేమో అని ఆ దేశ అభిమానులు ఆశగా చూస్తున్నారు. చూద్దాం ఈ మెగా టోర్నీలో నెగ్గి విశ్వవిజేతగా ఎవరు నిలుస్తారో..!