వైరల్ : కులదీప్ పై సెహ్వాగ్ ట్వీట్..

SMTV Desk 2018-07-13 15:37:02  sehwag funny tweet, kuldeep yadav, india vs england, kohli

న్యూఢిల్లీ. జూలై 13: ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా జట్టు కోహ్లి సారథ్యంలో దూసుకుపోతుంది. టీ-20 సిరీస్ ను చేజిక్కించుకొన్న ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ పై కన్నేసింది. సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ ను చైనామన్‌ బౌలర్ కులదీప్ యాదవ్ తన బౌలింగ్ తో ముప్పతిప్పల పెట్టాడు. గురువారం జరిగిన తొలి వన్డేలో కుల్దీప్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. అయితే ప్రతీ విషయంపై ఫన్నీగా ట్వీట్‌ చేసే సెహ్వాగ్‌ కుల్దీప్‌ను సైతం అదే తరహాలో పొగిడాడు. "అరే ఏం బౌలింగ్‌.. కుల్దీప్‌ టాప్‌ 5 గొప్ప ప్రదర్శనలన్నీ ఓవర్సీస్‌లోనివే. కట్టప్పా.. బహుబలిని ఎలా చంపిండో తెలిసిపోయింది కానీ.. కుల్దీప్‌ ఆట మాత్రం ఇం‍గ్లండ్‌కు అర్థం కావడం లేదు" అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్ గా మారింది. 6 వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌ ఈ ఘనత సాధించిన తొలి లెఫ్టార్మ్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. కుల్దీప్‌ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆడుకోగా.. రోహిత్‌ శతకంతో బౌలర్లను ఆడుకోని భారత్‌కు విజయాన్నందించాడు. తొలి టీ20 ముగిసిన తర్వాత.. కుల్దీప్‌ యాదవ్‌ను ఎదుర్కొనేందుకు మెర్లిన్‌ అనే బౌలింగ్ యంత్రాన్ని గత వారం ఇంగ్లాండ్‌ రంగంలోకి దింపింది. గతంలో.. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ని ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ ఈ బౌలింగ్ మిషన్ సాయంతో ప్రాక్టీస్ చేశారు. కానీ.. ఇప్పుడు ఈ బౌలింగ్ యంత్రం కూడా కుల్దీప్ యాదవ్ నుంచి ఇంగ్లాండ్‌ను కాపాడలేకపోతోంది. మరి కులదీప్ ను ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి ఇంగ్లాండ్ జట్టుకి కుల్దీప్ యాదవ్ కొరకరాని కొయ్యగా మారాడు.